Thursday, September 19, 2024
Homeజాతీయంపేషేంట్ నుంచి రూపాయి ఎక్కువ వ‌సూలు చేశాడు

పేషేంట్ నుంచి రూపాయి ఎక్కువ వ‌సూలు చేశాడు

Date:

ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోని ఓ పేషేంట్ నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూల్ చేసిన కారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. స్వయంగా ఎమ్మెల్యే ఆస్పత్రిలో తనిఖీలు చేయగా.. కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్ జిల్లా జగదౌర్ ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ కొన్నిరోజులుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జగదౌర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సివ్వా ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రేమ్ సాగర్ పటేల్ సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫార్మసిస్ట్ తన నుంచి ఒక రూపాయి అధికంగా వసూల్ చేశాడంటూ ఎమ్మెల్యేకు ఓ పేషేంట్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఫార్మసిస్ట్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే స్పందించిన జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సదరు కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్‌ను విధుల నుంచి తొలగించారు. సదరు ఉద్యోగి రూ.1కి బదులుగా రూ.2 వసూలు చేశాడు. ఒక్క రూపాయి అధికంగా వసూల్ చేసిన ఫార్మసిస్ట్‌ను ఎమ్మెల్యే నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫార్మసిస్ట్ థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా సంజయ్‌ అనే వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. ఈ తనిఖీలలో భాగంగా ఎమ్మెల్యే ఇతర పేషంట్ల సమస్యలను కూడా తెల్సుకుని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.