దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ కమిటీ అందజేసిన రిపోర్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే.
రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదన చేసింది. సెప్టెంబర్‌లో ఆ ప్యానెల్ ఏర్పాటైంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కోవింద్ ప్యానెల్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. న్యాయశాఖ ఆ రిపోర్టును ఇవాళ కేంద్ర క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టింది. వంద రోజుల మోదీ సర్కార్ పాలన సందర్భంగా ఈ రిపోర్టును ముందుకు తీసుకువచ్చారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను చూసేందుకు ఇంప్లిమెంటేషన్ గ్రూపును ఏర్పాటు చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇక మున్సిపాల్టీలు, పంచాయితీ ఎన్నికలకే రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్వహిస్తుందని రిపోర్టులో తెలిపారు.