భారత ప్రధాని
నరేంద్ర మోడీ.. మంగళవారం 74వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. మోడీ బర్త్ డే సందర్భంగా.. బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీకి.. వచ్చిన బహుమతులను వేలం వేయాలని నిర్ణయించింది. అనేక సందర్భాల్లో ప్రధానమంత్రికి వచ్చిన గిఫ్ట్‌లను వేలం వేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా వేలం వేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు ఈ వేలం నిర్వహించనున్నారు.
ఈ వేలంలో 600 బహుమతులు ఉంచనున్నట్లు కేంద్రం తెలిపింది. స్పోర్ట్స్ షూ మొదలుకొని.. వెండి వీణ, రామ మందిరం ప్రతిమ వంటి అనేక గిఫ్టులు వేలానికి అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఇందులో తక్కువలో తక్కువ విలువగల వస్తువు రూ.600 అని.. ఇక గరిష్ఠంగా రూ.8.26 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ బహుమతులను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు అమ్మనున్నారు. ఈ-వేలం మోదీ బర్త్‌డే సందర్భంగా మంగళవారం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నమామి గంగే నిధికి విరాళాలు అందజేస్తూ ఈ-వేలంలో పాల్గొనాలని కేంద్రం తెలిపింది. ఇలా ప్రధాని మోదీ బహుమతులను వేలం వేయడం 2019లో ప్రారంభించారు. తమకు ఇష్టమైన బహుమతి కోసం ప్రజలు ఈ వేలంలో పాల్గొనవచ్చని కేంద్రం పేర్కొంది. ఈ ఆన్‌లైన్ వేలం అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు అధికారిక వెబ్‌సైట్ అయిన https://pmmementos.gov.in ద్వారా పేర్లు నమోదు చేసుకుని పాల్గొనవచ్చని తెలిపింది. వీటిలో విశిష్ట కళాఖండాలు, వివిధ ఆలయాల నమూనాలు, హిందూ దేవతలు, పారాలింపియన్ల షూస్ ఉన్నాయి.