Saturday, September 21, 2024
HomeUncategorizedమేడారం జాతరలో తొలి అడుగు

మేడారం జాతరలో తొలి అడుగు

Date:

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే మేడారంలో భక్తజనం పోటెత్తుతోంది. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు భారీగా చేస్తోంది. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో తొలి అడుగు పడనుంది. నేడు మేడారంలో గుడి మెలిగే పండుగను పూజారులు నిర్వహిస్తున్నారు. మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయాలను శుద్ధిచేసి ప్రత్యేక పూజలు నేడు నిర్వహించనున్నారు. ఆలయాలలో బూజు దులిపి, అమ్మవార్ల సామాగ్రిని శుద్ధిచేసి, కడిగి ముగ్గులు పెట్టి మేడారం మహా జాతరకు రంగం సిద్ధం చేస్తున్నారు.

నేడు గుడి మెలిగే పండుగతో మేడారంలో మహా జాతరకు తొలి అడుగు పడుతుంది. ఇదిలా ఉంటే మేడారం మహా జాతరకు సంబంధించి 105 కోట్ల రూపాయలతో సకల వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మహా జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు జరిగే మహా జాతరకు కోటిన్నర వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మ్యాప్ ని సిద్ధం చేయడంతో పాటు, జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను బట్టి అందుకు తగిన సౌకర్యాలను కల్పిస్తున్నారు. మరోవైపు మేడారం వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే 40 లక్షలమంది భక్తులను తీసుకురావడం లక్ష్యంగా రవాణా శాఖ పనిచేస్తుంది. జాతరకు వారం ముందు నుండే మేడారంలో భక్తుల కోసం 24 గంటల వైద్య సదుపాయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకురానుంది.