Saturday, September 21, 2024
HomeUncategorizedఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి

ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి

Date:

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఆమెను చూసిన ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలారు. భారీ భద్రతతో కూడిన కాన్వాయ్‌ను వదిలి సామాన్యురాలిలా కొంతసేపు మెట్రో రైలులో ప్రయాణించారు. విద్యార్థులతో ముచ్చటించారు. రైల్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ వికాస్‌ కుమార్‌ ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

రాష్ట్రపతి భవన్‌కు సమీపంలో ఉన్న సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్‌ను ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మెట్రో పనితీరు, ఇతర వివరాలను డీఎంఆర్‌సీ ఎండీ వికాస్‌ కుమార్‌ రాష్ట్రపతికి వివరించారు. అనంతరం కొంతదూరం మెట్రో రైలులో ప్రయాణించారు. అమృత్‌ ఉద్యాన్‌గా పేరు మార్చిన మొఘల్‌ గార్డెన్స్‌తో పాటు రాష్ట్రపతి భవన్‌లోని ఇతర ఉద్యానవనాలను ప్రజలు సందర్శించేందుకు వీలుగా ‘అమృత్‌ ఉద్యాన్‌-2024’ను ఇటీవల ప్రారంభించారు. మార్చి 31 వరకు ఇది ప్రజలకు అందుబాటులో ఉండనుంది. దీని సందర్శనకు వెళ్లే పర్యటకుల కోసం ఢిల్లీ మెట్రో ఉచిత సేవలు ప్రారంభించింది. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నాలుగో గేటు నుంచి ప్రయాణికులు ఉచితంగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లొచ్చని తెలిపింది.