15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిపై కేసు పెట్టడంతో గ్రామంలోని దళితులను వెలివేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక యాద్గిర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా బాలిక గర్భవతి అని తేలింది. దీంతో వారు బాలికను ప్రశ్నించగా ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమానుషానికి పాల్పడ్డాడని, ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని పేర్కొంది. దీంతో వారు నిందితుడి వద్దకు వెళ్లి ఆమెను వివాహం చేసుకోవాలని కోరారు. అతడు ఆధిపత్యవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో దళిత బాలికను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. ఈ విషయంపై బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలిక కుటుంబం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామంలోని 50 దళిత కుటుంబాలను గ్రామ పెద్దలు వెలేశారని, తమకు ప్రాథమిక సౌకర్యాలు, కిరాణా సామగ్రి, ఆహారం అందకుండా చేస్తున్నారని దళిత సంఘాల సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు గ్రామ పెద్దలను అదుపులోకి తీసుకొని విచారించగా వారు ఆ ఆరోపణలను ఖండించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.