Thursday, September 19, 2024
HomeUncategorizedకోచింగ్ సెంట‌ర్ల‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేదు

కోచింగ్ సెంట‌ర్ల‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేదు

Date:

కోచింగ్ సెంటర్లపై తనకు నమ్మకం లేదని, క్లాస్ రూంలో టీచర్లు చెప్పే పాఠాలపై శ్రద్ధ పెట్టని వారికే కోచింగ్ క్లాసులు అవసరమని కోచింగ్‌ క్లాసెస్‌పై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐఐటీలు, నీట్ వంటి కోచింగ్ ఇన్ స్టిట్యూట్‌లు ఏ విధంగా ఉపయోపడతాయి..? అనే ప్రశ్నకు నారాయణ మూర్తి ఈ విధంగా స్పందించారు. ‘కోచింగ్ సెంటర్లపై నాకు నమ్మకం లేదు. కోచింగ్ క్లాసులకు వెళ్ళే చాలా మంది విద్యార్థులు స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాలను జాగ్రత్తగా విననివారే. లేదంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువులో సాయం చేయలేని స్థితిలో ఉండి ఉంటారు. అలాంటి వాళ్లే కోచింగ్‌ సెంటర్ల వైపు మొగ్గుచూపుతారు. పిల్లలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి ఈ కోచింగ్‌ సెంటర్లు తప్పుడు మార్గంగా నిలుస్తున్నాయి’ అని నారాయణమూర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడమే అసలైన విద్యావిధానమని ఈ సందర్భంగా నారాయణమూర్తి అన్నారు. దురదృష్టవశాత్తు మన దేశంలో బట్టీ చదువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దీని వల్ల విద్యార్థుల్లో ఆలోచించే శక్తి ఉండటం లేదన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు చదువుకోవడానికి ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించాలన్నారు. తల్లిదండ్రులు కూడా పుస్తకాలు పట్టుకుని చదివితే వారిని చూసి పిల్లలకి కూడా చదువుకోవాలన్న ఆసక్తి కలుగుతుందని వివరించారు.