మణిపూర్‌లో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. శనివారం ఉదయం ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు సాయుధులు ప్రాణాలు కోల్పోయినట్లు మణిపూర్ పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు చూరాచాంద్‌పుర్‌లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడ్నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది.
రాకెట్ దాడుల్లో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తొలి రాకెట్ దాడి తెల్లవారుజామున 4.30 గంటలకు ట్రోంగ్లావ్‌బిలో చోటు చేసుకుంది. ఈ దాడిలో రెండు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రెండో దాడి మ. 3 గంటలకు మొయిరంగ్‌లోని మాజీ సీఎం మైరెంబమ్ కొయిరెంగ్ నివాస ఆవరణలో జరిగింది. రాకెట్‌కు అమర్చిన బాంబులు పేలడంతో వృద్ధుడు మృతి చెందాడు. ఈ పరిణామాల నేపథ్యంలో చూరాచాంద్‌పుర్‌లోని మువాల్‌సంగ్, లైకా మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మూడు బంకర్లను పోలీసులు కూల్చేశారు.