Sunday, December 22, 2024
Homeక్రైంమ‌హిళ ప‌ట్ల అంబులెన్స్ డ్రైవ‌ర్ అస‌భ్య‌క‌ర ప్ర‌వ‌ర్త‌న‌

మ‌హిళ ప‌ట్ల అంబులెన్స్ డ్రైవ‌ర్ అస‌భ్య‌క‌ర ప్ర‌వ‌ర్త‌న‌

Date:

ఒక మ‌హిళ అనారోగ్యంతో ఉన్న త‌న భర్తను అంబులెన్స్‌లో తీసుకెళ్తుండ‌గా ఆ మహిళ పట్ల డ్రైవర్‌, మరో వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెను లైంగికంగా వేధించారు. ఆ మహిళ ప్రతిఘటించడంతో ఆమె భర్తకు ఆక్సిజన్‌ సపోర్ట్‌ తీసేశారు. భర్తతోపాటు ఆ మహిళను అంబులెన్స్‌ నుంచి బయటకు తోసేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్‌ 30న అనారోగ్యంతో ఉన్న భర్త హరీష్‌ను సమీపంలోని బస్తీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు అతడి భార్య తీసుకెళ్లింది. ఆ వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.

ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లే స్థోమత లేకపోవడంతో ఆ మహిళ తన భర్తను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్లసాగింది. ఈ సందర్భంగా ఆమెను ముందు సీటులో కూర్చోవాలని డ్రైవర్‌ బలవంతం చేశాడు. అతడితోపాటు మరో వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ మహిళ ప్రతిఘటించడంతో అంబులెన్స్‌ను నిలిపివేశారు. ఆమె భర్తకు ఆక్సిజన్‌ సపోర్ట్‌ తీసేశారు. వారిద్దరిని అంబులెన్స్‌ నుంచి బయటకు తోసేశారు. దీంతో గాయపడిన ఆమె భర్త ఆరోగ్యం మరింతగా క్షీణించింది. మరోవైపు ఆ మహిళ తన సోదరుడికి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పింది. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళ భర్తను గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అనంతరం బాధిత మహిళ అంబులెన్స్‌ డ్రైవర్‌, సహాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.