Friday, September 20, 2024
HomeUncategorizedవైద్యుల భ‌ద్ర‌త‌పై కేంద్రం రాష్ట్రాల‌కు లేఖ‌

వైద్యుల భ‌ద్ర‌త‌పై కేంద్రం రాష్ట్రాల‌కు లేఖ‌

Date:

దేశంలోని వైద్యుల భద్రతపై కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. వారి భద్రత కోసం తీసుకున్న (కార్యాచరణ ప్రణాళిక) చర్యలపై సెప్టెంబర్ 10వ తేదీలోపు నివేదికను అందించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య కార్యదర్శి అపూర్వ చంద్ర ఈ లేఖ పంపారు. కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా పెను దుమారం కొనసాగుతోంది. ఓ వైపు దీనిపై ఆందోళనలు జరుగుతుండగానే.. ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర ..తదితర రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులపై అఘాయిత్యాలు, దాడుల వంటి ఘటనలు చోటుచేసుకోవడం దిగ్భ్రాంతి కలిగించింది. వైద్యుల భద్రతకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. పని ప్రదేశంలో వైద్యారోగ్య సిబ్బందికి భద్రత నిమిత్తం అవసరమైన చర్యలను సూచించింది. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజా లేఖలో ఆ చర్యలను ప్రస్తావించింది.

కేంద్రం చేసిన సూచనలివే..

వైద్యారోగ్య సిబ్బంది రక్షణ కోసం ఉన్న చట్టాలు, వారిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలి. ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషల్లో ఈ నోటీసులు ఉండాలి. ఆసుపత్రుల్లో హింసాత్మక ఘటనల నియంత్రణ, వైద్యుల భద్రత కోసం అమలు చేయాల్సిన వ్యూహాల కోసం సీనియర్‌ వైద్యులు, పాలనాధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలి. ఆసుపత్రుల్లోని కీలక ప్రదేశాల్లోకి సాధారణ ప్రజలు, రోగుల బంధువుల కదలికలపై నియంత్రణ ఉండాలి. విజిటర్‌ పాస్‌ పాలసీని కఠినంగా అమలు చేయాలి. రాత్రి విధుల సమయంలో క్యాంపస్‌లోని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రెసిడెంట్‌ డాక్టర్లు, నర్సులు సురక్షితంగా వెళ్లేలా సదుపాయాలు కల్పించాలి. రాత్రివేళల్లో ఆసుపత్రి క్యాంపస్‌లోని అన్ని భవనాలు, హాస్టళ్లలో తగిన వెలుతురు ఉండేలా చూడాలి. రాత్రి విధుల సమయంలో హాస్పిటల్‌ క్యాంపస్‌లో రొటీన్‌ పెట్రోలింగ్‌ ఏర్పాటు చేయాలి. ఆసుపత్రిని స్థానిక పోలీసు స్టేషన్‌కు అనుసంధానం చేయాలి. లైంగిక వేధింపులపై విచారణ కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలి. క్యాంపస్‌లోని ప్రతి మూలా సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా చూస్తూ వాటిని నిరంతరం పర్యవేక్షించాలి.