Monday, December 30, 2024
HomeUncategorizedమేక‌ప్ లేకుంటే కంగ‌నను ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌రు

మేక‌ప్ లేకుంటే కంగ‌నను ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌రు

Date:

బీజేపీ ఎంపీ, న‌టి కంగనా రనౌత్‌పై హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రి జగత్‌ సింగ్‌ నేగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి మేకప్‌ లేకుంటే కంగనను ప్రజలు గుర్తించలేరని వ్యాఖ్యానించారు. ఇటీవలే హిమాచల్‌ ప్రదేశ్‌ను భారీ వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిల్‌స్టేట్‌లోని వరద ప్రభావిత ప్రాంతాన్ని గత నెలలో కంగన సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అప్పట్లోనే నటి ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. ఆ ఫొటోలపై జగత్‌ సింగ్‌ నేగి తాజాగా వివాదాస్పదంగా స్పందించారు.

ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘అంతా సాధారణ స్థితికి వచ్చాక కంగన రాష్ట్రానికి వచ్చారు. భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు వచ్చినప్పుడు ఆమె రాలేదు. సొంత నియోజకవర్గం మండిలో తొమ్మిది మంది మరణించినప్పుడు ఆమె రాలేదు. వర్షం పడుతున్నప్పుడు మేకప్‌ కొట్టుకుపోతుంది.. అందుకే ఆమె రావడానికి ఇష్టపడలేదు. మేకప్‌ లేకుండా ఆమెను ప్రజలు గుర్తించలేరు. వరద పరిస్థితి మెరుగుపడినాక వచ్చి మొసలి కన్నీరు కార్చారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగత్‌ సింగ్‌ నేగి వ్యాఖ్యలపై హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను అవమానించేవిలా ఉన్నాయంటూ మండిపడింది. కాగా, ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు చోటు చేసుకున్న ఘటనల్లో కనీసం 153 మంది మరణించారు. రూ.1.271 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా.