Sunday, December 22, 2024
HomeUncategorizedఇంకా వ‌ర‌ద‌నీటిలో బెజ‌వాడ‌

ఇంకా వ‌ర‌ద‌నీటిలో బెజ‌వాడ‌

Date:

ఎడ‌తెరిపి లేకుండా కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల‌న తెలుగు రాష్ట్రాలు అత‌లాకుత‌లంగా మారాయి. వ‌ర‌ద ప్ర‌భావంతో బీభ‌త్సంగా మారాయి. మూడురోజులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు సహాయక చర్యలతో ఇప్పుడిప్పుడే ఉపశమనం కలుగుతోంది. విజయవాడలో వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమాలను సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ బాధితులకు సహాయం అందిస్తున్నారు. వాహనాలు వెళ్లలేని చోటికి సాంకేతికత సాయంతో ఆహారం పంపిణీ చేస్తున్నారు. దీనికోసం డ్రోన్లు, హెలికాప్టర్ల సాయం తీసుకుంటున్నారు. మరోవైపు వరద బాధితుల సహాయార్థం పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.

బాధితులకు అందరూ అండగా నిలవాలి: సీఎం చంద్రబాబు

వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్‌ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు. ఈ కష్ట సమయంలో బాధితులకు అందరూ అండగా నిలవాలని కోరారు. ఏవిధంగా సహకారం అందించగలిగితే అలా చేయూత అందించాలన్నారు. ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తామని చెప్పారు.

ఎన్టీఆర్‌ రూ.కోటి, సిద్ధూ జొన్నలగడ్డ రూ.30లక్షలు

ఏపీ, తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ నటులు, నిర్మాణ సంస్థలు విరాళాలు ప్రకటించాయి. ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి రూ.50లక్షల చొప్పున మొత్తం రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ఎన్టీఆర్‌ తెలిపారు. సిద్ధూ జొన్నలగడ్డ రూ.30లక్షలు (ఏపీ, తెలంగాణకు రూ.15 లక్షలు చొప్పున), విష్వక్‌సేన్‌ రూ.10లక్షల విరాళం ప్రకటించారు.

500కు పైగా రైళ్ల రద్దు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. తాజాగా 28 రైళ్లను రద్దు చేయగా, కొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు కాగా.. 152 సర్వీసులను దారి మళ్లించారు. తాజాగా 28 రైళ్లు రద్దు చేశారు. దీంతో మొత్తం 500కు పైగా రైళ్లు రద్దయినట్లయింది. వీటిలో సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌, విశాఖ- సికింద్రాబాద్‌ వందేభారత్‌, నాందేడ్ – సంబల్‌పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ – హౌరా మెయిల్, చెన్నై సెంట్రల్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, విశాఖ- నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి.