Sunday, December 22, 2024
HomeUncategorizedమహిళలపై నేరాలు ఆందోళన కలిగిస్తున్నవి

మహిళలపై నేరాలు ఆందోళన కలిగిస్తున్నవి

Date:

రోజురోజుకు దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆడవారిపై, చిన్నారులపై జరిగే దాడులపై వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలని ఆయన పేర్కొన్నారు. శనివారం భారత్‌ మండపంలో జిల్లా న్యాయవ్యవస్థలపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కళాశాలలో హత్యాచారం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకొంది.

”దేశంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ఇప్పటికే చాలా చట్టాలున్నాయి. 2019లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు చట్టాన్ని పాస్‌ చేశాం. దీనికింద సాక్షులను రక్షించే కేంద్రాలను ఏర్పాటుచేశాం. జిల్లా పర్యవేక్షక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని తదుపరి మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహిళపై నేరాల విషయంలో వేగంగా తీర్పులు వెలువడతాయి. నేడు ఆడవారు, చిన్నారులపై జరిగే నేరాలు సమాజంలో తీవ్ర ఆందోళనకరంగా మారాయి” అని ప్రధాని మోదీ అన్నారు. ఈ అమృత్‌కాల్‌ సమయంలో 140కోట్ల మంది దేశ ప్రజలు అభివృద్ధి చెందిన, సరికొత్త భారత్‌ను చూడాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం కేసుల విచారణలో జాప్యాన్ని తొలగించేందుకు వీలుగా తీసుకొన్న చర్యలను మోడీ వివరించారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల స్మారక చిహ్నం స్టాంప్‌ను ఆయన విడుదల చేశారు.