Friday, September 20, 2024
HomeUncategorizedమోడీజీ మీ నుంచి స‌మాధానం రాలే

మోడీజీ మీ నుంచి స‌మాధానం రాలే

Date:

పశ్చిమబెంగాల్‌లోని జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు. అత్యాచార ఘటనలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినచట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని మరోసారి తన లేఖలో అభ్యర్థించారు. ”ఈ సున్నిత అంశంపై మీనుంచి ఎలాంటి సమాధానం అందలేదు” అని పేర్కొన్నారు. తాను రాసిన లేఖపై ప్రధాని నుంచి నేరుగా సమాధానం రాకపోవడంపై విచారం వ్యక్తంచేశారు. మహిళా శిశుసంక్షేమశాఖ నుంచి బదులు వచ్చిందని చెప్పిన ఆమె.. సమస్య తీవ్రత దృష్ట్యా ఆ సాధారణ సమాధానం సరిపోదన్నారు.

హత్యాచార ఘటనపై వారం రోజుల క్రితం మోడీకి దీదీ తొలిసారి లేఖ రాశారు. ”దేశంలో మహిళలపై జరుగుతోన్న అత్యాచార ఘటనలను మీ దృష్టికి తీసుకురావాలనుకొంటున్నా. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు జరుగుతుండటం భయానక పరిస్థితిని సూచిస్తోంది. ఇలాంటి చర్యలు సమాజం, దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ దురాగతాలకు ముగింపు పలకడం ద్వారా మహిళలు తాము సురక్షితంగా, భద్రంగా ఉన్నామని భావించేలా చేయడం మనందరి కర్తవ్యం. ఘోరమైన నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సత్వర న్యాయం జరగాలంటే ఈ కేసుల విచారణ 15 రోజుల్లో పూర్తి చేయాలి” అని పేర్కొన్నారు.