Saturday, September 21, 2024
HomeUncategorizedమాజీ సైనికుడు ఉగ్రవాదిగా మారాడు

మాజీ సైనికుడు ఉగ్రవాదిగా మారాడు

Date:

మాజీ సైనికుడిగా పని చేసి ఉగ్రవాదిగా మారిన ఒక వ్యక్తిని దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేసినప్పుడు అందిన సమాచారం మేరకు ఈ అరెస్టు జరిగింది. నిందితుడిని లష్కరే తోయిబాకు చెందిన రియాజ్‌ అహ్మద్‌గా గుర్తించారు. అతడు మాజీ సైనికుడు. ”జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు రియాజ్‌, అతడి సహచరులు ప్రయత్నించారు. ఇందుకోసం వారు పాక్‌లో టెర్రరిస్టు హ్యాండ్లర్‌ నుంచి ఆయుధాలు,మందుగుండు తెప్పించేందుకు కుట్ర పన్నారు. వీటితో దాడులు చేయాలన్నది ఈ బృందం లక్ష్యం” అని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

జమ్మూకశ్మీర్‌లోని కుప్‌వాడా జిల్లాలో దాడుల కుట్రను ఇటీవలే భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి ఆయుధాల స్మగ్లింగ్‌కు ప్రయత్నిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో జహూర్‌ అహ్మద్‌ భట్‌ అనే వ్యక్తి వద్ద 5 ఏకే సిరీస్‌ రైఫిళ్లు, తూటాలు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నారు. అతడికి సరిహద్దు అవతలవైపు ఉగ్రమూకతో సంబంధాలున్నాయి. పీవోకేలోని లష్కరే నాయకులు మంజూర్‌ అహ్మద్‌ షేక్‌, ఖాజీ మహమ్మద్‌ ఖుషాల్‌ల ఆదేశాల మేరకు ఈ బృందం పనిచేస్తున్నట్లు తేలింది.

ఈ సందర్భంగా రియాజ్‌తోపాటు ఖుర్షీద్‌ అహ్మద్‌, గులాం సర్వార్‌ అనే వ్యక్తులు కూడా పాక్‌లోని ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగానే ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఆదివారం దాడి చేసి అరెస్టు చేశారు. ఇతడి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్‌, సిమ్‌కార్డ్‌ను స్వాధీనం చేసుకొన్నారు. మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న ఒక వ్యక్తిని ఇటీవలే యూపీలోని మేరఠ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఓ ఆర్మీ మాజీ ఉద్యోగి ఉగ్రవాదులకు సహకరిస్తూ అరెస్టు కావడం గమనార్హం.