Saturday, December 21, 2024
HomeUncategorized9లక్ష‌ల మంది బ‌యోమెట్రిక్ అన్‌బ్లాక్‌

9లక్ష‌ల మంది బ‌యోమెట్రిక్ అన్‌బ్లాక్‌

Date:

అస్సాం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ఆధార్‌ నమోదు విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన 9,35,682 మంది పౌరుల బయోమెట్రిక్‌ వివరాలను అన్‌బ్లాక్‌ చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉడాయ్‌ని ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం బుధవారం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ పౌర నమోదు అప్‌డేషన్‌ ప్రక్రియలో భాగంగా 2019 ఫిబ్రవరి-ఆగస్టు మధ్యలో ఈ 9.35లక్షల మంది బయోమెట్రిక్‌ వివరాలను ఉడాయ్‌ లాక్‌ చేసింది. ఆధార్‌ కార్డు జారీకి వీరు అర్హులేనా కాదా? అనేది తెలుసుకునేందుకు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, వీరి వివరాలను అన్‌బ్లాక్‌ చేయాలని గత కొంతకాలంగా అస్సాం ప్రభుత్వం, సీఎం హిమంత బిశ్వ శర్మ కేంద్రాన్ని కోరుతున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల సొలిసిటర్‌ జనరల్‌ ఈ అంశాన్ని అధ్యయనం చేసి న్యాయశాఖకు పలు సూచనలు చేశారు. వీరికి ఆధార్‌ కార్డు జారీలో ఎలాంటి చట్టపరమైన అడ్డంకి లేదని ఎస్‌జీ గుర్తించారు. ఆ సూచనల మేరకు వారి బయోమెట్రిక్‌ వివరాలను వెంటనే అన్‌బ్లాక్‌ చేయాలని ఉడాయ్‌కి సూచించినట్లు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తమ ఉత్తర్వులో వెల్లడించింది. ”ఆధార్‌ చట్టం ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని బాధిత అస్సాం పౌరులకు విశిష్ట ప్రాధికార గుర్తింపు కార్డులు జారీ చేయాలి” అని పేర్కొంది. తాజా నిర్ణయంపై అస్సాం ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.