Saturday, September 21, 2024
HomeUncategorizedకార్యకర్తలకు కుక్క తినే బిస్కెట్లను ఇస్తున్నారు

కార్యకర్తలకు కుక్క తినే బిస్కెట్లను ఇస్తున్నారు

Date:

ఝార్ఖండ్‌లో జరిగిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్ గాంధీ ఓ కార్యకర్త చేతికి కుక్క తినే బిస్కెట్లు ఇచ్చినట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిని బీజేపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఈ వీడియోను బిజెపి నేత అమిత్ మాలవీయ షేర్‌ చేస్తూ.. ”కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పార్టీ బూత్‌ ఏజెంట్లను కుక్కలతో పోల్చారు. ఇప్పుడేమో రాహుల్‌ కుక్క తినే బిస్కెట్లను కార్యకర్తలకు ఇస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు, యువరాజు కార్యకర్తలను కుక్కల్లా చూస్తారు కాబట్టి అలాంటి పార్టీ కనుమరుగవడం సహజమే” అంటూ దుయ్యబట్టారు. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని కొందరు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు ట్యాగ్‌ చేశారు. ఆయన గతంలో రాహుల్‌ పెంపుడు శునకంపై కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ మీటింగ్‌లకు రాహుల్‌ నివాసానికి వెళ్లేవాడినని, అప్పుడు ఆయన పెంపుడు కుక్క పిడి తినే ప్లేటులో నుంచే కాంగ్రెస్‌ నాయకులకు బిస్కెట్లు ఆఫర్‌ చేసేవారని హిమంత చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

ఈ క్రమంలోనే నెటిజన్లు ఆయనకు ట్యాగ్‌ చేయగా.. తాజా వీడియోపై ఆయన స్పందించారు. ”రాహుల్ గాంధీ మాత్రమే కాదు. ఆయన కుటుంబం మొత్తం కలిసినా నన్ను ఆ బిస్కెట్ తినేలా చేయలేకపోయారు. నేను ఆత్మాభిమానం ఉన్న అస్సామీని, భారతీయుడిని. అందుకే ఆ కుక్క బిస్కెట్లు నిరాకరించాను. కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను” అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ వివాదంపై రాహుల్‌గాంధీ స్పందించారు. వీడియోలో తాను మాట్లాడిన కార్యకర్తదే ఆ కుక్కపిల్ల అని వెల్లడించారు. ”ఆ కుక్కపిల్లను చూడగానే ముచ్చటేసింది. దగ్గరకు తీసుకుని బిస్కెట్లు ఇచ్చేందుకు ప్రయత్నించా. కానీ అది భయపడిపోయింది. అందుకే దాని యజమానికి బిస్కెట్లు ఇచ్చి తినిపించమని చెప్పా. ఇందులో వివాదం చేయాల్సినంత ఏముంది?” అని బిజెపి నేతలకు కౌంటర్‌ ఇచ్చారు.