Friday, September 20, 2024
HomeUncategorizedమాల్దీవుల‌కు త‌గ్గిన భార‌త ప‌ర్యాట‌కుల సంఖ్య‌

మాల్దీవుల‌కు త‌గ్గిన భార‌త ప‌ర్యాట‌కుల సంఖ్య‌

Date:

మాల్దీవుల‌కు వెళ్లే భార‌త ప‌ర్యాట‌కుల సంఖ్య దారుణంగా ప‌డిపోయింది. మాల్దీవుల ప‌ర్యాట‌క‌ మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్‌- జూన్ త్రైమాసికంలో 54,207 మంది భారతీయ పర్యటకులు మాల్దీవుల్లో పర్యటించారు. ఈ ఏడాది అదే కాలంలో ఆ సంఖ్య 2,604కి పడిపోయింది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయుజ్జు చైనా పర్యటకులను తమ దేశంలో పర్యటించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ప్రారంభంలోని మొదటి ఆరు నెలల్లో అత్యధికంగా 1.2 లక్షల మంది చైనా పర్యాట‌కులు మాల్దీవుల్లో పర్యటించారు. లక్షద్వీప్‌కు వెళ్లే పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌- జూన్‌ నెలల్లో 11,074 మంది దేశీయ పర్యటకులు లక్షద్వీప్‌ను సందర్శించగా.. ఈ ఏడాది అదే కాలంలో ఆ సంఖ్య 22,990కి చేరింది. అగత్తి విమానాశ్రయానికి విమాన రాకపోకలు సైతం భారీగా ఊపందుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌- జూన్‌లో 418 విమానాలు రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది అదే కాలంలో ఆ సంఖ్య 786కు చేరింది.

ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ.. లక్షద్వీప్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు.. భారత్‌ సహా ప్రధానిపై నోరుపారేసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయుజ్జు భారత దళాలను వెనక్కి పంపాలని నిర్ణయించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ పరిణామాల మధ్య అనేక మంది భారతీయులు మాల్దీవుల పర్యటనను విరమించుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో బాయ్‌కాట్‌ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌తో భారతీయులు నిరసన వ్యక్తం చేశారు.