Friday, September 20, 2024
HomeUncategorizedఎమ్మెల్సీ కవిత‌కు సుప్రీంకోర్టు బెయిల్‌

ఎమ్మెల్సీ కవిత‌కు సుప్రీంకోర్టు బెయిల్‌

Date:

ఢిల్లీ లిక్క‌ర్ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధానమైన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని.. ఈడీ కూడా దర్యాప్తు పూర్తిచేసిందని పేర్కొంది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదంది. మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద అరెస్ట్‌ చేసినట్లు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌ అప్పట్లో ప్రకటించారు. అరెస్ట్‌ వారెంట్‌తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి, మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి ఐదు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తిహాడ్‌ జైలుకు తరలించారు.