తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు.
మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పేరిట రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రేవంత్‌రెడ్డి చెక్కులు అందజేశారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకానికి ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్ నిధులు సమకూరుస్తోంది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాం తదితరులు పాల్గొన్నారు.