పశ్చిమబెంగాల్ కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ పలు కీలక అంశాలు వెల్లడించింది. సెమినార్ హాల్ డోర్ బోల్ట్ పని చేయడం లేదని తమ విచారణలో బయటపడినట్లు పేర్కొంది. బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘సెమినార్ హాల్ డోర్ బోల్ట్ విరిగిపోయింది. నేరం జరుగుతుండగా ఎవరూ లోనికి రాకుండా ఉండేందుకు హాల్ బయట నిల్చొని ఎవరైనా సహకరించారా’ అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ విషయాన్ని నిర్ధరించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపింది.
గొళ్లెం పనిచేయకపోవడం గురించి ఇంటర్న్‌లు, జూనియర్ డాక్టర్ సిబ్బంది తమ విచారణలో బయటపెట్టినట్లు సీబీఐ వెల్లడించింది. దీంతో బోల్ట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆగస్టు 9న తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య హాల్‌లోకి ప్రవేశించిందని డ్యూటీలో ఉన్న వైద్యుడు చెప్పినట్లు అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను శుక్రవారం సీబీఐ ప్రశ్నించింది. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోల్‌కతాలో ప్రత్యేక న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.