Monday, December 23, 2024
Homeక్రైంమైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారం

మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారం

Date:

కోల్కతా ఘటన మరువక ముందే అస్సాంలో మరో అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) జరిగిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది. బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండ‌గా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఉదాంతం చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు నిరవధిక బంద్‌కు వివిధ సంస్థలు, నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేయడంపై దేశం మొత్తం ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో అమాయక చిన్నారులపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

బాలిక వాంగ్మూలాన్ని మహిళా పోలీసు రికార్డు చేసిందని నాగావ్ ఎస్పీ స్వప్నిల్ దేకా తెలిపారు. బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి.. ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా స్పందించారు. అత్యాచార ఘటన మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా అభివర్ణించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని డీజీపీని ఆదేశించారు. ముఖ్యమంత్రి హిమంత ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘మైనర్‌కు సంబంధించిన భయంకరమైన సంఘటన మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరమని రాశారు’. ఈ ఘటనలో తాము ఎవరినీ విడిచిపెట్టమని హెచ్చరించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని సీఎం బిస్వా శర్మ డీజీపీని ఆదేశించారు.