అర్హత లేని సిబ్బందితో విమానాలను నడిపినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు రూ.99 లక్షల జరిమానా విధించింది. అలాగే ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్స్, డైరెక్టర్ ట్రైనింగ్‌పై కూడా ఆరు లక్షలు, మూడు లక్షల చొప్పున అదనపు జరిమానా విధించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత పైలట్‌ను డీజీసీఏ హెచ్చరించింది.
నాన్ లైన్ రిలీజ్డ్ ఫస్ట్ ఆఫీసర్‌తో జతగా నాన్ ట్రైనర్ లైన్ కెప్టెన్ నేతృత్వంలో ఒక విమానాన్ని ఎయిర్ ఇండియా నడిపింది. 2024 జూలై 10న ఈ మేరకు ఒక నివేదికను స్వచ్ఛందంగా డీజీసీఏకు సమర్పించింది. దీంతో పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత ముఖ్యమైన భద్రతా ఉల్లంఘనగా, షెడ్యూలింగ్ మార్పుగా రెగ్యులేటర్ సంస్థ గుర్తించింది. జూలై 22న సంబంధిత ఎయిర్ ఇండియా అధికారులకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వారు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందకపోవడంతో సంబంధిత నియమ నిబంధనల మేరకు ఎయిర్ ఇండియాకు భారీగా జరిమానా విధించింది.