Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయంకత్తెర కారణంగా 36విమానాలు రద్దు

కత్తెర కారణంగా 36విమానాలు రద్దు

Date:

జపాన్‌లో అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హక్కైడో ద్వీపంలోని న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్‌లోని రిటైల్ స్టోర్ నుండి ఒక కత్తెర ఆగష్టు 17న కనిపించకుండా పోయింది. ఆ రిటైల్ స్టోర్ యజమాని విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు ప్రయాణికులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. కత్తెర కోసం విమానాశ్రయం మొత్తం వెతికారు. విమానాలు ఎక్కేందుకు ఎయిర్‌పోర్టుకు వస్తున్న ప్రయాణికుల భద్రతా తనిఖీలను నిలిపివేసి.. దాదాపు 2 గంటలపాటు కత్తెర కోసం వెతికారు. దీంతో అధికారులు ఆ విమానాశ్రయం నుంచి 36 విమానాలను రద్దు చేశారు. అదే సమయంలో, మరో 201 విమానాలు ఆలస్యంగా నడిచాయి.

ఈ క్రమంలో ఈ ఘటనపై న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించారు. విమానాశ్రయంలోని రిటైల్ స్టోర్‌లో కత్తెర కనిపించకపోవడంతో ప్రయాణికుల భద్రత కోసం ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీలు చేశామన్నారు. ఎవరైనా ఉగ్రవాదులు కత్తెరను తీసుకుని బెదిరించి విమానాలను హైజాక్ చేసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. అదృశ్యమైన కత్తెర ఎట్టకేలకు అదే చిల్లర దుకాణంలో లభ్యమైంది. ఈ నేపథ్యంలో ఆ రిటైల్ స్టోర్‌లో నిర్వహణ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని ఎయిర్‌పోర్టు అధికారులు ఎట్టకేలకు తేల్చారు.

ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విమానాలు ఆలస్యం కావడంతో అదే న్యూ చిటోస్ విమానాశ్రయంలో చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు నిరీక్షణ భరించలేక వెళ్లిపోయారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ విమానాశ్రయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.