Saturday, September 21, 2024
HomeUncategorized37ఏళ్లు బంగ్లాదేశ్ జైల్లో గడిపిన వ్య‌క్తి

37ఏళ్లు బంగ్లాదేశ్ జైల్లో గడిపిన వ్య‌క్తి

Date:

భార‌త్‌కు చెందిన ఒక వ్యక్తి బంగ్లాదేశ్‌ జైళ్లలో 37 ఏళ్లు గడిపాడు. చివరకు ఒక సంస్థ సహకారంతో భారత్‌కు తిరిగి వచ్చాడు. 62 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశాడు. పెద్ద వాడైన కుమారుడ్ని చూసి ఆనందం పట్టలేకపోయాడు. త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోనామురా సబ్‌డివిజన్‌లోని సరిహద్దు గ్రామం రవీంద్రనగర్‌లో నివసిస్తున్న 25 ఏళ్ల షాజహాన్, 1988లో బంగ్లాదేశ్‌ కొమిల్లాలోని తన అత్తమామల ఇంటికి వెళ్లాడు. అయితే ఆ ఇంటిపై బంగ్లాదేశ్‌ పోలీసులు రైడ్‌ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు షాజహాన్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో ఆయన భార్య గర్భవతి.

బంగ్లాదేశ్‌లోని కొమిల్లా కోర్టు షాజహాన్‌కు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆ జైలు శిక్ష ముగిసినప్పటికీ అతడిని విడిచిపెట్టలేదు. తప్పుడు ఆరోపణలతో ఇతర జైళ్లకు తరలించారు. దీంతో అదనంగా 26 సంవత్సరాలు బంగ్లాదేశ్‌ జైళ్లలో గడిపాడు. ఈ నేపథ్యంలో షాజహాన్‌కు జరిగిన అన్యాయం గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో అతడి దుస్థితి గురించి జారా ఫౌండేషన్‌కు తెలిసింది. మరోవైపు విదేశాల్లో చిక్కుకున్న వలసదారులకు సహాయం చేసే ఈ సంస్థ షాజహాన్ విడుదలకు చాలా కృషి చేసింది. అనేక చట్టపరమైన చర్యల తరువాత బంగ్లాదేశ్‌ పోలీసులు, అధికారులు అతడ్ని విడుదల చేశారు. దీంతో మంగళవారం శ్రీమంతపూర్‌ ఎల్‌సీఎస్‌ వద్ద బీఎస్‌ఎఫ్‌ ఇబ్బందికి ఆయనను అప్పగించారు. ఈ నేపథ్యంలో 37 ఏళ్ల తర్వాత సొంతూరుకు చేరుకున్న షాజహాన్‌ తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. పెద్ద వాడైన తన కుమారుడ్ని తొలిసారి చూసి ఆనందం పట్టలేకపోయాడు. ఈ జన్మలో ఇంటి తిరిగి వస్తానని అనుకోలేదని తెలిపాడు. తనను ఇంటికి చేర్చిన జరా ఫౌండేషన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నాడు.