Saturday, December 21, 2024
HomeUncategorizedబాలిక‌లు లైంగిక కోరికలు అణుచుకోవాలి

బాలిక‌లు లైంగిక కోరికలు అణుచుకోవాలి

Date:

బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలంటూ గత సంవ‌త్స‌రం ఓ తీర్పు సందర్భంగా కలకత్తా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టును చేరడంతో తాజాగా కీలక తీర్పు వెలువరించింది. ఆ వివాదాస్పద తీర్పును కొట్టివేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఆ కేసులో నిందితుడికి వేసిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆ వ్యక్తి కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. గతేడాది అక్టోబరులో దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. సంచలన తీర్పు వెలువరించింది. బాలిక అతడితో ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందన్న కారణంతో అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఆ సందర్భంగా న్యాయస్థానం కొన్ని సూచనలు చేసింది. ”కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే.. సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారు. కిశోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి” అని సూచించింది.

దీనిపై అప్పట్లో పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సూచనలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేసింది. వీటిపై గతంలో విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కోర్టు సూచనలపై అసహనం వ్యక్తంచేసింది. న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పరాదని పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై తీర్పు వెలువరించింది. నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. అతడి శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాక.. కోర్టులు తీర్పులు ఎలా రాయాలన్న దానిపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.