Saturday, September 21, 2024
HomeUncategorizedనిమిషానికి 693 రాఖీలు విక్రయించారు

నిమిషానికి 693 రాఖీలు విక్రయించారు

Date:

రాఖీ పండగ రోజు సోద‌రుడికి రాఖీ క‌ట్టాల‌నే అక్కా, చెల్లెళ్లు త‌పించిపోతారు. సోదరుడు ఎక్కడ ఉన్నా.. క్షణాల్లో రాఖీలను, గిఫ్ట్‌లను అందించే సదుపాయం క్విక్‌ కామర్స్‌ సంస్థల రూపంలో అందుబాటులోకి వచ్చింది. దీంతో రక్షాబంధన్‌ వేళ బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ సంస్థలు ‘పండగ’ చేసుకున్నాయి. రికార్డు సేల్స్‌ను నమోదు చేశాయి. రక్షాబంధన్‌ సందర్భంగా గతేడాది కంటే మెరుగైన విక్రయాలు నమోదు చేసినట్లు బ్లింకిట్‌ ప్రకటించింది. ఒకరోజులో అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయని బ్లింకిట్‌ సీఈఓ అల్బీందర్‌ దిండ్సా పేర్కొన్నారు. సగటున నిమిషానికి 693 రాఖీలు విక్రయించినట్లు తెలిపారు. చాక్లెట్‌ సేల్స్‌ కూడా విపరీతంగా పెరిగాయన్నారు. రక్షాబంధన్‌ సందర్భంగా తమ సేవలపై ఉంచిన నమ్మకానికి గానూ కృతజ్ఞతలు తెలియజేశారు.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ సైతం మెరుగైన అమ్మకాలు నమోదు చేసింది. రాఖీలతో పాటు సోదరుడికి గిఫ్ట్‌లు ఇచ్చే ఆనవాయితీ కారణంగా తమ ప్లాట్‌ఫామ్‌పై పర్ఫ్యూమ్‌ ఆర్డర్లు ఏకంగా 646 శాతం పెరిగినట్లు స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. చాక్లెట్ల తర్వాత అత్యధికంగా గిఫ్ట్‌లుగా ఇచ్చినవి ఇవేనని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ముంబయి నుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని, మంబయికి చెందిన ఓ వ్యక్తి రూ.11,320 విలువైన వస్తువులను తన సోదరికి రాఖీ గిఫ్ట్‌గా పంపించాడని తెలిపారు. అందులో బొమ్మలు, చాక్లెట్లతో పాటు కొన్ని సౌందర్య ఉత్పత్తులు అందులో ఉన్నట్లు చెప్పారు.