పశ్చిమబెంఆల్ కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటన కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది భద్రత విషయమై ఆసుపత్రులు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించింది. అలాగే నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లోకి రావాలని ఈ సందర్భంగా కోరింది. ఘటన జరిగిన ఆర్‌జీ కార్ ఆసుపత్రి వద్ద సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని ఆదేశించింది.
ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అందించే గదుల వద్ద అదనపు భద్రతా ఏర్పాటు చేయాలి. ఆసుపత్రుల్లోకి ప్రమాదరక వస్తువులు రాకుండా బ్యాగేజీ స్క్రీనింగ్ చేయాలి. పేషంట్లు కాకుండా.. లోపలికి వచ్చే విజిటర్స్ సంఖ్యపై పరిమితి ఉండాలి. రద్దీని నిర్వహించడానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. వైద్యులు, నర్సులకు రెస్ట్ రూమ్‌ల వసతి కల్పించాలి. అక్కడ బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ ఏర్పాట్లు ఉండాలి. ఆసుపత్రి ప్రాంగణంలోని అన్ని ప్రాంతాల్లో సరిపడా వెలుతురు ఉండాలి. అలాగే సీసీ కెమెరాలను అమర్చాలి. రాత్రి పది నుంచి తెల్లవారుజామున ఆరు గంటల మధ్యలో రవాణా సదుపాయం కల్పించాలి. బాధ, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వర్క్‌షాపులను నిర్వహించాలి. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ప్రతి మూడునెలలకోసారి ఆడిట్ చేపట్టాలి.
POSH Act (మహిళా ఉద్యోగులందరికీ సురక్షితమైన పనివాతావరణాన్ని కల్పించడం) వైద్య సంస్థలకు వర్తిస్తుంది కాబట్టి.. అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. వైద్యనిపుణలకు అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్స్ అందుబాటులో ఉంచాలి.
”మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే. ఈ రోజుల్లో చాలామంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరం” అని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై మూడు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఈ కమిటీని సూచించింది. అలాగే రెండు నెలల్లోగా తుది నివేదిక సమర్పించాలని వెల్లడించింది.