Thursday, January 2, 2025
HomeUncategorizedగంగాన‌దిపై నిర్మిస్తున్న తీగ‌ల వంతెన కూలింది

గంగాన‌దిపై నిర్మిస్తున్న తీగ‌ల వంతెన కూలింది

Date:

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే గంగా నదిపై నిర్మిస్తున్న తీగల బ్రిడ్జిలోని ఒకవైపు భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. గత తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ వంతెన కూలడం ఇప్పటికి ఇది మూడోసారి కావడం గమనార్హం. నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన పదేపదే కూలిపోతుండటంతో నిర్మాణ నాణ్యత, ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సీఎం కలల ప్రాజెక్టు అయిన ఈ తీగల వంతెన వరుసగా కూలిపోతుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2014లో ప్రారంభమైన దీని నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలయడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇంతకీ ఈ వంతెన తమకు అందుబాటులోకి వస్తుందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వంతెన కూలిన ఘటనపై ప్రాజెక్టు బాధ్యత వహించే నిర్మాణ సంస్థ ఎస్‌కే సింగ్లా కన్స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎలాంటి వివరణా ఇవ్వలేదు.

బీహార్‌లోని ఖగారియా, భాగల్‌పూర్‌ జిల్లాలను కలుపుతూ గంగానదిపై ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. సీఎం నితీశ్‌ కుమార్‌ కలల ప్రాజెక్టు అయిన దీనిని 3.1 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో రూ.1,710 కోట్లతో అగువాని సుల్తాన్‌గంజ్‌ పేరుతో నిర్మిస్తున్నారు. 2014లో దీని నిర్మాణానికి నితీశ్‌ కుమార్‌ శంకుస్థాపన చేశారు. 2020 నాటికే ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా.. ఇప్పటికీ పూర్తికాలేదు. మరోవైపు నిర్మాణంలో ఉండగానే ఇప్పటికే ఈ వంతెన రెండుసార్లు కూలిపోయింది.

మొదటిసారి ఈ వంతెన 2022 జూన్‌ 30న కుప్పకూలింది. భాగల్పూర్‌ వైపున 5, 6 స్తంభాల మధ్య ఉన్న సూపర్ స్ట్రక్చర్ కూలి గంగా నదిలో పడిపోయింది. ఆ తర్వాత గతేడాది (2023) జూన్‌ 4న మరోసారి బ్రిడ్జి కూలిపోయింది. ఖగారియా వైపు 10, 12 స్తంభాల మధ్య ఉన్న భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది. దీంతో బీహార్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన నితీశ్‌ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్న SK సింగ్లా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు జరిమానా విధించింది. వంతెనను కంపెనీ ఖర్చుతోనే పునర్నిర్మించాలని ఆదేశించింది. ఇప్పుడు తాజాగా మరోసారి కూలిపోవడంతో ఈ వంతెనలో ఉపయోగించే మెటీరియల్‌, నాణ్యతపై స్థానికుల్లో తీవ్ర అనుమానం వ్యక్తమవుతోంది.