Monday, November 11, 2024
HomeUncategorizedకేజ్రీవాల్ పిటిష‌న్ తిర‌స్క‌రించిన సుప్రీంకోర్టు

కేజ్రీవాల్ పిటిష‌న్ తిర‌స్క‌రించిన సుప్రీంకోర్టు

Date:

ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేజ్రీకి మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేమని పేర్కొంది. ఈ మేరకు కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసులో బెయిల్‌ కోరుతూ కేజ్రీవాల్‌ ఇటీవలే సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ తనను అరెస్ట్‌ చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానంలో సవాల్‌ చేశారు. ఈ కేసులో కేజ్రీ రెగ్యులర్‌ బెయిల్‌ కోసం పిటిషన్‌ వేసినట్లు ఆప్‌ న్యాయ బృందం సోమవారం తెలిపింది. దీంతో పాటు గతంలో ఈ కేసులో ట్రయల్ కోర్టు తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధ‌వారం విచారణ జరిపింది. ఇరువురి తరఫున వాదనలు విన్న ధర్మాసనం సీఎం కేజ్రీవాల్‌కు ఈ కేసులో మధ్యంతరం బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేజ్రీ పిటిషన్‌పై సమాధానాన్ని కోరుతూ సీబీఐకి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. మద్యం కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో కేజ్రీని ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తీహార్‌ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ప్రస్తుతం సీబీఐ కేసులో తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. మరోవైపు కేజ్రీ జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు సెప్టెంబర్‌ 2 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే.