Monday, December 30, 2024
HomeUncategorizedసామాన్య ప్రజలకు ఆయుష్మాన్ భారత్

సామాన్య ప్రజలకు ఆయుష్మాన్ భారత్

Date:

సామాన్య ప్రజల ఆరోగ్య కోసం భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన లేదా ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సామాన్య ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్‌ అందిస్తుంది. ఆర్థికంగా వెనకబడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద కేంద్రం, ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు వైద్యం కోసం ఆర్థిక సాయం అందిస్తుంది.

*అతి పెద్ద పథకం..*

పిఎంజెఎవై స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం. 2008లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంగా ఉన్న స్కీమ్‌ను, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)గా మార్చింది. ఈ పథకానికి నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి.

*కావలసిన డాక్యుమెంట్లు..*

ఆయుష్మాన్ కార్డు ఉన్నవారు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఇందుకు కొన్ని కీలక డాక్యుమెంట్లు అవసరం. దరఖాస్తుదారుకి రేషన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్ అవసరం. ఆదాయ ధృవీకరణ పత్రం (గరిష్ట వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు మాత్రమే) ఉండాలి.

*ఆయుష్మాన్ భారత్ దరఖాస్తు విధానం*

అర్హత ఉన్న ఎవరైనా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కోసం రెండు మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని సిఎస్ సి లేదా ఎంపానెల్డ్ ఆసుపత్రిని సంప్రదించవచ్చు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌కి రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లండి.

 *మీకు అర్హత ఉందా?*

మీరు పిఎంజెఏవై పథకం లబ్ధి పొందడానికి అర్హులో కాదో ఇలా తెలుసుకోవచ్చు. ముందుగా పిఎంజెఏవై పథకం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సందర్శించండి. హోమ్‌ పేజీలో ‘యామ్ ఐ ఎలిజిబుల్’ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేసి, ‘జనరేట్‌ ఓటీపీ’ బటన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రాష్ట్రం, మీ పేరు, రేషన్ కార్డ్ నంబర్, ఇంటి నంబర్ లేదా మొబైల్ నంబర్‌ రిజిస్టర్ చేయండి. మీ కుటుంబం ఆయుష్మాన్ భారత్ యోజన పరిధిలో ఉంటే రిజల్ట్స్‌లో మీ పేరు కనిపిస్తుంది.

* చికిత్స ఎలా పొందుతారు?*

మీరు ఈ పథకానికి అర్హులై, మీరు కార్డు అందుకుంటే, మీరు రూ.ఐదు లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఈ పథకం కింద అందుకున్న కార్డు చూపించి ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవచ్చు.