Sunday, September 22, 2024
HomeUncategorizedషూలో ఒకటిన్నర కేజీల బంగారం

షూలో ఒకటిన్నర కేజీల బంగారం

Date:

బంగారాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్ ఫోర్టు అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా షూలో దాదాపు ఒకటిన్నర కేజీల బంగారాన్ని దాచేశాడు. అయితే అతగాడి నడక, వ్యవహారంలో ఏదో తేడా కొట్టింది. ఇదే విషయం పసిగట్టిన అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా అసలు బండారం బయటపడింది. ఈ సంఘటన హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. 

దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) హైదరాబాద్ జోనల్ యూనిట్ అరెస్టు చేసింది. EK-528 విమానంలో అంతర్జాతీయ అరైవల్ హాల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సదరు ప్రయాణికుడి బూట్లు, వీపుకు తగిలించుకునే సామాన్ల బ్యాగ్‌ను అధికారులు స్కాన్ చేయగా దాదాపు కిలోన్నర బంగారం బయటపడింది. బ్యాటరీ ఆకారంలో ఉన్న రెండు పసుపు రంగు పెద్ద మెటల్ బార్‌లు నిందితుడి ఎడమ కాలి షూలో, బ్యాక్‌ ప్యాంక్‌ బ్యాగ్‌లో దాచాడు. అలాగే పసుపు రంగులో ఉన్న ఓ మెటల్‌ గొలుసును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1390.850 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,06 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. కస్టమ్స్ యాక్ట్ 1962 నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.