Sunday, September 22, 2024
HomeUncategorizedఒలింపిక్స్ కోసం భారత్ ఖర్చు దాదాపు రూ.420కోట్లు..?

ఒలింపిక్స్ కోసం భారత్ ఖర్చు దాదాపు రూ.420కోట్లు..?

Date:

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తన ప్రస్థానాన్ని ముగించింది. మహిళల 76 కేజీల ఫ్రీస్టయిల్ లో రితిక క్వార్టర్ ఫైనల్లో ఓడింది. రితికను ఓడించిన రెజ్లర్ సెమీస్ లో ఓడటంతో ఆమెకు రెపిచాజ్ పద్ధతిలో కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లేకుండా పోయింది. ఇక మహిళల గోల్ఫ్ లో అదితి అశోక్ 29వ స్థానంలో నిలిచింది. మొత్తం మీద 16 క్రీడాంశాల్లో మొత్తం 117 మంది భారత ప్లేయర్లు బరిలోకి దిగారు. అయితే కేవలం 6 పతకాలు మాత్రమే లభించాయి. అందులో 5 కాంస్య పతకాలు కాగా.. ఒక రజత పతకం. షూటింగ్ లో మూడు కాంస్యాలు.. హాకీలో ఒక కాంస్యం.. రెజ్లింగ్ లో మరో కాంస్యం లభించగా.. జావెలిన్ త్రోలో రజతం దక్కింది.

మను భాకర్ రెండు కాంస్యాలను సాధించింది. టోక్యోలో బంగారు పతకం నెగ్గిన నీరజ్ చోప్రా ఈసారి రజతంతో సరిపెట్టుకున్నాడు. బాక్సింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ లలో భారత్ కు నిరాశ ఎదురైంది. కొన్ని ఈవెంట్స్ లో భారత ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాలను కోల్పోయారు. మహిళల రెజ్లింగ్ లో ఫైనల్ కు చేరిన వినేశ్ ఫోగాట్.. వెయిట్ ఎక్కువగా ఉండటంతో అనర్హత వేటుకు గురైంది. ఫలితంగా భారత్ కు పతకం లభించలేదు. అయితే ప్రస్తుతం దీనిపై భారత్ అప్పీల్ చేసింది. త్వరలో తీర్పు వచ్చే అవకాశం ఉంది.

ఓవరాల్ గా చూసుకుంటే.. ఈసారి ఒలింపిక్స్ లో భారత ప్రదర్శన నిరాశ పరిచింది. టోక్యో ఒలింపిక్స్ లో ఒక బంగారు పతకం.. రెండు రజతాలు.. నాలుగు కాంస్యాలతో మొత్తం 7 పతకాలను సాధించింది. అప్పుడు భారత్ పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి కేవలం 6 పతకాలతో 71వ స్థానంలో కొనసాగుతుంది. ఈ స్థానం మరింత దిగజారే అవకాశం కూడా ఉంది.

ఈ ఒలింపిక్స్ కోసం భారత్ దాదాపుగా రూ. 420 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే భారత ప్లేయర్లు మాత్రం ఆశించిన స్థాయిలో పతకాలను సాధించలేకపోయింది. ఒలింపిక్స్ ముందు భారత్ 10 పతకాలను టార్గెట్ గా పెట్టుకుంది. అయితే దానిని సాధించలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ పతకాల ట్యాలీని కూడా సమం చేయలేకపోయింది. ముఖ్యంగా ఆశలు పెట్టుకున్న పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు పతకాలను సాధించడంలో విఫలం అయ్యారు.