Sunday, September 22, 2024
HomeUncategorizedపాఠశాల‌ల్లో 'గుడ్‌ మార్నింగ్' బదులు 'జై హింద్‌'

పాఠశాల‌ల్లో ‘గుడ్‌ మార్నింగ్’ బదులు ‘జై హింద్‌’

Date:

ఆగస్టు 15న స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని హ‌రియాణా ప్రభుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు టీచర్లకు, తోటి స్నేహితులకు పలకరింపుగా ‘గుడ్‌ మార్నింగ్’కు బదులుగా ‘జై హింద్‌’ అని చెప్పాలని పాఠశాల విద్యా డైరెక్టరేట్ నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో చిన్ననాటినుంచే దేశభక్తి, దేశంపై గౌరవం, ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయజెండాను ఎగురవేసే ముందు నుంచి ఈ సూచనలను అమలుచేయనున్నట్లు వెల్లడించారు.

”దేశంలో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ప్రజల్లో ఐక్యతను పెంపొందించడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటుచేశారు. జైహింద్‌ అనే నినాదంతో ప్రజలను ఒక్కటి చేశారు. మన నాయకుల అవిశ్రాంత కృషితో స్వాతంత్ర్యం సాధించారు. ఆ సమయంలో నాయకులు ఒకరికి ఒకరు ‘జై హింద్‌’ చెప్తూ పలకరించుకునేవారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఈ పలకరింపులను అమలు చేయడం వల్ల విద్యార్థుల్లో దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణ పెంపొందుతుంది. ఈ పదం దేశం గొప్పతనాన్ని ప్రతిరోజూ వారికి గుర్తు చేస్తోంది” అని విద్యాశాఖ పేర్కొంది.