ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సిసోడియాకు బెయిల్ రావడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ తాజాగా స్పందించారు. ఆలస్యం అయినా న్యాయమే గెలుస్తుందని అర్థం వచ్చేలా ఓ ట్వీట్ పెట్టారు. ‘న్యాయం జరగడంలో కొంత ఆలస్యం కావొచ్చు. కానీ, తిరస్కరించబడదు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్ కోసం తీవ్రంగా పోరాటం చేశారు. ఈ క్రమంలో సుప్రీం తీర్పుతో 17 నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్న సిసోడియాకు భారీ ఊరట లభించినట్లైంది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. చివరికి సత్యమే గెలిచింది అంటూ ఆప్ నేతలు సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు.
ఇదే కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో కేజ్రీని ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ప్రస్తుతం సీబీఐ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు కేజ్రీ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ ఆయనను తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.