భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాలతో రోజుల తరబడి అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరో ఎనిమిది నెలల పాటు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాసా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
8 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఆ సాంకేతిక సమస్యను ఇంకా సరిదిద్దకపోవడంతో గత రెండు నెలలుగా వీరిద్దరూ ఐఎస్ఎస్‌లోనే ఉండిపోయారు.
ఈ క్రమంలోనే వ్యోమగాముల రాకపై నాసా బుధవారం ఓ అప్‌డేట్ ఇచ్చింది. ”బోయింగ్ స్టార్‌లైనర్ తిరిగి భూమ్మీద ల్యాండ్ అయ్యేందుకు సురక్షితంగా లేకపోతే.. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు ఎంచుకున్న ఆప్షన్లలో ఒకటి 2025 ఫిబ్రవరిలో ఉంది. అది కూడా స్పేక్స్ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో..” అని నాసా పేర్కొంది. దీన్నిబట్టి చూస్తుంటే సునీత, విల్‌మోర్ మరో ఎనిమిది నెలల పాటు ఐఎస్ఎస్‌లోనే ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.