ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన అధికారానికి అడ్డం వస్తారని అనుమానిస్తే సొంత వారిని కూడా వదిలిపెట్టరు. గతంలో సవతి సోదరుడిపైనే విషప్రయోగం చేయించిన ఆయన.. తాజాగా నానమ్మపైనే ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ఆమెకు చెందిన పెద్ద రాజభవనాన్ని బుల్డోజర్లతో కూలగొట్టాడు.
కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ తొలి భార్య కుమారుడి వారసుడే కిమ్ జోంగ్ ఉన్. ఇక భార్య మరణంతో ఇల్ సంగ్ రెండో వివాహం చేసుకొన్నారు. ఆమె పేరు కిమ్ సంగ్ ఏ. వీరి సంతానానికి వారసత్వం అప్పగించేందుకు యత్నాలు జరిగినట్లు తెలియడంతో అంతఃపుర వైరం మొదలైంది.
ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ ఆమెను 1994లో హాప్‌జాంగ్ ప్యాలెస్ అనే భవనంలో నిర్బంధించారు. అప్పటికే కిమ్ తాత ఇల్ సంగ్ మరణించారు. ఇది దేశరాజధాని ప్యాంగ్యాంగ్-ప్యాంగ్‌సంగ్‌కు మధ్యలోని ఓ పర్వత ప్రాంతంలో ఉంది. ఇక్కడ దాదాపు 11 హెక్టార్లలో అటవీ ప్రాంతం, హాప్‌జాంగ్ నది ఉన్నాయి. ప్రత్యేక భద్రతా సిబ్బంది రక్షణ, ఇతర ఉద్యోగులు ఇక్కడ పనిచేసేవారు. ఇక తన తండ్రి రెండో భార్య కుమారుడు కిమ్ ప్యాంగ్ ఇల్‌ను దౌత్యవేత్త బాధ్యతలపై ప్రవాసానికి పంపించారు. అంతకు మించి ఆయన తన సవతి తల్లికి హాని తలపెట్టాలని చూడలేదు.