బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ వెల్లడించారు. గురువారం సాయంత్రం 8 గంటలకు యూనస్ ప్రమాణస్వీకారం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి విలేకరులతో మాట్లాడిన ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్.. 15 మందితో ప్రభుత్వ సలహా మండలి ఏర్పాటు కానుందని చెప్పారు. పార్లమెంటును రద్దు చేసి, యూనస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు చేసిన డిమాండ్ నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతి (ఛాన్సలర్)గా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా సేవలందించి, బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతి కోసం కృషిచేశారు. చిట్టగాంగ్‌లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థిక వేత్త. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తి కలిగించిన ఘనతను సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులూ ఆయన్ను వరించాయి.