తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా షాద్ నగర్ ఘటన కలకలం రేపింది. దళిత మహిళపై పోలీసులు రాత్రిపూట స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై చాలా మంది స్పందించారు. కొంచెం ఆలస్యంగానైనా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి స్పందించారు. ‘ఇప్పుడు కూడా ఈ థర్డ్ డిగ్రీ చిత్రహింసలు ఏంటండి? బుద్ధి ఉందా?’ అని ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు. వాస్తవానికి ఇలాంటి ఘటనలు చాలా జరుగుతాయని, బయటికి రానివి పది రెట్లు ఉంటాయని చెప్పారు.
బలహీనవర్గాలపై ఇలాంటి దాడులను దయచేసి ఆపండి అంటూ పోలీసులకు ఆకునూరి మురళి విజ్ఞప్తి చేశారు. ‘మీరు సెలవులు లేకుండా చాలా కష్టపడతారు. కానీ, ఇలాంటి దుర్మార్గాలతో డిపార్ట్‌మెంట్ అంతా బద్నాం అవుతుంది’ అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, డిపార్ట్‌మెంట్ క్రమశిక్షణ చర్యలతోపాటు చట్టపర చర్యలు తీసుకుని నిందితులను జైలుకు పంపాలని కోరారు. ఇంకా ఎన్నాళ్లు ఈ థర్డ్ డిగ్రీల చిత్రహింసలు? దయచేసి తెలంగాణను థర్డ్ డిగ్రీ చిత్రహింసల నుంచి విముక్తి చేయండి అంటూ రాష్ట్ర డీజీపీ ట్యాగ్ చేసి కోరారు. పోలీసుల దాడులను నిలిపేయాలని పేర్కొంటూ రాష్ట్ర సీఎంవోను ట్యాగ్ చేశారు.