Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మార్చింది 26ఏళ్ల కుర్రాడు

బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మార్చింది 26ఏళ్ల కుర్రాడు

Date:

బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్త ఆందోళనలు తీవ్రస్థాయిలో చేసి, ఆ దేశ ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమాన్ని నిర్వహించింది ఓ 26 ఏళ్ల కుర్రాడు. చిన్న ఆందోళనగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ఏకంగా ప్రధాని హసీనా భవితవ్యాన్ని అంధకారం చేసింది. బంగ్లాదేశ్‌ పతాకాన్ని నుదుటకు చుట్టుకొని తరచూ ఆందోళనల్లో మీడియాకు కనిపించాడు. మొత్తం ఉద్యమాన్ని సమన్వయం చేశాడు. ఆ యువకుడి పేరు నహిద్‌ ఇస్లామ్‌. అతడు ఢాకా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విద్యార్థి.

ఈ ఏడాది జులైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నహిద్‌, మరికొందరు విద్యార్థులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు అరెస్టు చేశారు. తొలిసారి అతడు బంగ్లాదేశ్‌ ప్రజల దృష్టిని అప్పుడే ఆకర్షించాడు. ఆ తర్వాత అదే ఉద్యమం తుపానుగా మారి ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. ఈ ఘర్షణల్లో 300 మంది విద్యార్థులు మరణించారు. వీరిలో చాలా మంది వివిధ విశ్వవిద్యాలయాలకు చెందినవారు. దీంతో హసీనా పదవికి రాజీనామా చేసి భారత్‌కు వెళ్లిపోయారు.

నేటి సాయంత్రం నహిద్‌, ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌తో భేటీ కానున్నారు. ఈ విద్యార్థుల బృందం సైన్యం లేదా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అంగీకరించడంలేదు. నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనిస్‌ చీఫ్‌ అడ్వైజర్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విద్యార్థి ఉద్యమం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నహిద్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నాడు.

 1998 సంవత్సరంలో ఢాకాలో నహిద్‌ జన్మించాడు. అతడి తండ్రి ఓ టీచర్‌. అతడి సోదరుడు నఖిబ్‌. అతడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. తన సోదరుడి గురించి నఖిబ్‌ చెబుతూ ”అతడు ఎప్పుడూ దేశంలో మార్పు రావాలని ఆకాంక్షించేవాడు. అతడిని పోలీసులు అరెస్టు చేసి.. స్పృహతప్పేలా హింసించారు. ఆ తర్వాత రోడ్డుపై పారేశారు. అయినా భయపడకుండా పోరాటాన్ని కొనసాగించాడు” అని పేర్కొన్నాడు.