Monday, December 23, 2024
Homeక్రైండిజె సౌండ్ వల్ల కూలిన గోడ

డిజె సౌండ్ వల్ల కూలిన గోడ

Date:

మధ్యప్రదేశ్‌ సాగర్‌ జిల్లాలోని శాహ్‌పుర్‌ గ్రామంలో ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. దానికి డీజే బాక్స్‌లను వినియోగించారు. అంతకు ముందు కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే పరిమితికి మించి శబ్దాన్ని పెంచడంతో శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ప్రకంపనాలు ఏర్పడినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పాత గోడ కూలి దాని పక్కనే ఆడుకుంటున్న చిన్నారులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన చిన్నారులంతా 10 నుంచి 15 సంవత్సరాలలోపు వారే.

ఈ దుర్ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రేహిల్‌ ఎస్‌డీఎంలను బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షలు ప్రకటించారు. పరిమితికి మించి సౌండ్‌ పెంచిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న భవనాలను తక్షణమే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.