Sunday, September 22, 2024
HomeUncategorizedఆరోగ్య భీమా పాలసీలపై ఆదాయం రూ.8,263 కోట్లు

ఆరోగ్య భీమా పాలసీలపై ఆదాయం రూ.8,263 కోట్లు

Date:

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆరోగ్య బీమా ప్రీమియంలపైనే రూ.8,263 కోట్ల జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. ఈ మేరకు లోక్‌సభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి సోమవారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని తొలగించాలని ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఇదే తరహా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వీటిని తొలగించాలంటూ పలు విజ్ఞప్తులు వచ్చినట్లు పంకజ్‌ చౌధరి వెల్లడించారు. ఈ రెండు రకాల బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పేదలు, దివ్యాంగుల కోసం ఉద్దేశించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌, జన ఆరోగ్య బీమా పాలసీ, నిర్మయ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్ వంటి కొన్ని రకాల బీమా పాలసీ ప్రీమియంలను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు చౌధరి చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ₹8,262.94 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ₹7,638 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ₹5,354 కోట్లు ఆరోగ్య బీమాపై జీఎస్టీ రూపంలో వచ్చినట్లు మంత్రి చెప్పారు. జీఎస్టీ తొలగింపుపై కేంద్రం, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.