Sunday, September 22, 2024
HomeUncategorized20రోజుల్లో 14మంది చిన్నారులు మృతి

20రోజుల్లో 14మంది చిన్నారులు మృతి

Date:

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆశ్రమంలో చిన్నారుల అనుమానాస్పద మరణాలు చర్చనీయాంశమయ్యాయి. గడిచిన 20 రోజుల్లోనే 14 మంది ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతోంది. అందులో ఎక్కువ మంది మానసిక వికలాంగులే కావడం కలచివేస్తోంది. మొత్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 27 మంది చనిపోగా, మరణాలకు గల కారణాలు తెలియకపోవడం సంచలనంగా మారింది. దీనిపై వార్తలు రావడం, విపక్షాలు ఆందోళనలతో స్పందించిన ‘ఆప్‌’ ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. దేశ రాజధానిలో ఇటువంటి పరిణామం చోటుచేసుకోవడం షాక్‌కు గురిచేసిందని మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. ఇటువంటి నిర్లక్ష్యాలను సహించేదిలేదని, పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. 48గంటల్లోగా దీనిపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ.. నిజనిర్థార‌ణ‌ బృందాన్ని అక్కడికి పంపించినట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఆందోళనకు దిగిన భాజపా.. ఆశ్రమం ముందు ధర్నా చేపట్టింది. ప్రాంగణంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించింది. తమకు ఉన్న సమాచారం ప్రకారం, పిల్లలకు మురికి నీరు అందుతోందని, ఆహారం, చికిత్స కూడా సరిగా ఇవ్వడం లేదని బిజెపి నేతలు ఆరోపించారు. దీనికి బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో ఆశా కిరణ్‌ పేరుతో మానసిక వికలాంగుల ఆశ్రమం ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ హోం సాంఘిక సంక్షేమ శాఖ కిందకు వస్తుంది. ఇటీవల ఆ విభాగాధిపతి రాజీనామా చేయడంతో అది ఖాళీగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైల్లో ఉండటంతో ఆ శాఖ బాధ్యతలను వేరే మంత్రికి అప్పగించలేకపోయారు.