కేరళలో సంభవించిన ప్రకృతి విపత్తు బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వయనాడ్‌ను సందర్శించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు ప్రియాంక గాంధీ వెళ్లారు. అక్కడ నెలకొన్న పరిస్థితి చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ”దేశంలోనే అత్యంత భయంకరమైన విషాద ఘటన వయనాడ్‌లో చోటు చేసుకొంది. ప్రజలు తమ ఇళ్లు, కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరం. ఇలాంటి సమయంలో వారిని ఏ విధంగా ఓదార్చాలో తెలియడం లేదు. నా తండ్రి (రాజీవ్ గాంధీ) చనిపోయినప్పుడు ఎలా బాధపడ్డానో.. ఈరోజు అలాగే అనిపిస్తోంది” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
నా దృష్టిలో ఇది జాతీయ విపత్తు. ఈ ఘటనలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కేరళకు జరిగిన నష్టం దేశానికి తీరని విషాదం. ఇది రాజకీయాలకు సమయం కాదు.. బాధితులందరికీ అవసరమైన సాయం అందించడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి బాధితులకు రావాల్సిన సాయం అందేవరకు కాంగ్రెస్ పోరాడుతుంది. ఇలాంటి విపత్తులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై సమగ్ర కార్యచరణ ప్రణాళిక అవసరం” అని రాహుల్ పేర్కొన్నారు.