Monday, December 30, 2024
HomeUncategorized48 గంటల్లోనే నాలుగు అత్యాచారాలు

48 గంటల్లోనే నాలుగు అత్యాచారాలు

Date:

తెలంగాణ రాష్ట్రంలోని అత్యాచార ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా రాష్ట్రానికి హోం మంత్రి లేకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలను తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం 48 గంటల్లోనే నాలుగు చోట్ల సామూహిక అత్యాచారాలు చోటు చేసుకోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. మహిళలకు భద్రత లేకపోవడం కారణంగానే ఈ క్రూరమైన చర్యలకు దుండగులు పాల్పడుతున్నారు. ఈ వరుస ఘటనలు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలను ఎత్తి చూపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ, ఒక హోం మంత్రి లేకపోవడం దారుణం. హోంమంత్రి లేకపోవడం కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతుందన్నారు. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్, పుప్పాలగూడలో జరిగిన ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.