తుపాకీతో స్కూల్‌కి వెళ్లిన ఐదేళ్ల బాలుడు, మరో విద్యార్థిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన బీహార్ సుపౌల్ జిల్లాలోని ఒక పాఠశాలలో చోటు చేసుకొంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
నర్సరీ చదువుతున్న ఐదేళ్ల పిల్లవాడు తుపాకీని బ్యాగులో పాఠశాలకు తీసుకెళ్లాడు. మూడో తరగతి చదువుతున్న మరో విద్యార్థిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. బాలుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
తమ చిన్నారుల భద్రతపై బాలల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ ప్రిన్సిపల్‌ను అరెస్టు చేశారు. అసలు పిల్లాడి చేతికి తుపాకీ ఎలా వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. బాలుడి తండ్రి కోసం వెతుకుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే విద్యార్థుల బ్యాగులను క్షుణంగా తనిఖీ చేసిన లోనికి అనుమతించాలని జిల్లాలోని అన్ని పాఠశాలలను ఆదేశించనున్నట్టు సమాచారం.