ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. వాహనాల సంఖ్య ఇష్టానుసారంగా పెరగడంతో రద్దీ పెరిగిపోతుంది. గతేడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ గల నగరంగా బ్రిటన్ రాజధాని లండన్ నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 37 నిమిషాలకుపైగా పడుతున్నట్లు ‘టామ్‌టామ్ ట్రాఫిక్ సూచీ-2023’లో వెల్లడైంది. డబ్లిన్ (ఐర్లాండ్), టొరంటో (కెనడా)లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. టాప్-10 జాబితాలో భారత్‌లోని బెంగళూరు (6), పుణె (7)లు ఉన్నాయి.
- 55 దేశాల్లోని 387 నగరాల్లో 60 కోట్లకుపైగా ఇన్-కార్ నావిగేషన్ సిస్టమ్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు సంస్థ తెలిపింది.
- గతేడాది బెంగళూరులో 10 కి.మీల ప్రయాణానికి సగటున 28.10 నిమిషాలు పట్టినట్లు నివేదికలో తేలింది. రద్దీ కారణంగా ఇక్కడి వాహనదారులు ఏడాదిలో 132 గంటలు కోల్పోయారు. సగటు వేగం గంటకు 18 కి.మీలు మాత్రమే.
- పుణెలో 10 కిలోమీటర్లకు 27.50 నిమిషాల సమయం పట్టింది. స్థానికంగా వాహనాల సగటు వేగం గంటకు 19 కి.మీలుగా ఉంది. మొత్తం జాబితాలో దిల్లీ, ముంబయిలు 44, 54వ స్థానాల్లో నిలిచాయి.