Thursday, December 26, 2024
Homeఅంతర్జాతీయంవారంలోనే 20 కోట్ల డాలర్ల విరాళాలు

వారంలోనే 20 కోట్ల డాలర్ల విరాళాలు

Date:

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌.. విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. బైడెన్‌ వైదొలిగిన అనంతరం బరిలోకి వచ్చిన ఆమె.. వారం వ్యవధిలోనే దాదాపు 20 కోట్ల డాలర్లను సేకరించడం గమనార్హం. పార్టీలో ఆమెకు రోజురోజుకూ మద్దతు పెరుగుతుండగా ట్రంప్‌తో పోటీ విషయంలోనూ దూసుకెళ్తున్నారు. అయితే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండనుందని, కేవలం కొన్ని రాష్ట్రాల్లోని తక్కువ ఓటర్లే గెలుపోటములను నిర్ణయిస్తారని ఆమె ప్రచార బృందం తెలిపింది.

”అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ నిష్క్రమించిన అనంతరం.. ‘టీమ్ హారిస్’ రికార్డు స్థాయిలో 200 మిలియన్‌ డాలర్ల విరాళాలు సేకరించింది. ఈ మొత్తంలో 66 శాతం మొదటిసారి దాతల నుంచే వచ్చాయి. అదేవిధంగా 1.70 లక్షల మంది కొత్త వాలంటీర్లు ప్రచార పర్వంలో చేరారు. క్షేత్రస్థాయిలో లభిస్తోన్న విశేష ఆదరణకు ఇదే నిదర్శనం” అని హారిస్‌ ఫర్‌ ప్రెసిడెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖెల్ టైలర్ తెలిపారు. అధ్యక్ష అభ్యర్థి రేసులోకి ప్రవేశించి వారమే అయినప్పటికీ.. డెమోక్రాట్ల మద్దతు పొందినట్లు చెప్పారు. రికార్డు స్థాయిలో నిధుల సేకరణ మొదలు.. పెద్దఎత్తున వాలంటీర్లను కూడగట్టడం వరకు.. ట్రంప్- వాన్స్ జోడీని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. హారిస్‌తో సంవాదం జరిపేందుకు ట్రంప్‌ భయపడుతున్నట్లు పేర్కొన్నారు.