Tuesday, October 8, 2024
HomeUncategorizedఐఎఎస్ కావాలన్న ఆశలు ఆవిరయ్యాయి

ఐఎఎస్ కావాలన్న ఆశలు ఆవిరయ్యాయి

Date:

ఐఎఎస్ కావాలని కలలు గన్న ముగ్గురు విద్యార్థులు ఆశలు ఆవిరైపోయాయి. స్టడీ సర్కిల్ భవనం బేస్‌మెంట్‌లో నీటిలో చిక్కుకుని జల సమాధి అయ్యారు. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈ ఉదంతంపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల మృతిపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మంత్రి ఆతిషి ఓ ప్రకటన విడుదల చేశారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

ఢిల్లీలోని రావూస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ముగ్గురూ కేరళ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థులని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించినట్లు చెప్పారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు ఉంచామని, ఈ ప్రక్రియ ముగిసిన తరువాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ (సెంట్రల్ జోన్) ఎం హర్షవర్ధన్, అదనపు డీసీపీ సచిన్ శర్మ తెలిపారు. యాజమాన్యంపై కేసు నమోదైనట్లు చెప్పారు. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తోన్నామని, విద్యార్థులు, వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని అన్నారు.