Tuesday, October 8, 2024
HomeUncategorizedఓ స్త్రీ తన జీవితకాలంలో ఎంత మందికి జ‌న్మ‌నివ్వ‌గ‌ల‌దు..

ఓ స్త్రీ తన జీవితకాలంలో ఎంత మందికి జ‌న్మ‌నివ్వ‌గ‌ల‌దు..

Date:

పురాణాల్లో కొన్ని పాత్రలు వందల మంది బిడ్డలకు జన్మనిచ్చాయని తెలిసి ఆశ్చర్యపోతాం. అదెలా సాధ్యమని నోరెళ్లబెడతాం. కాని 18వ శతాబ్దంలో రష్యాలో వాసిలీవ్ అనే మహిళకు 69 మంది పిల్లలు పుట్టారు. అయితే ఒక స్త్రీ తన జీవితకాలంలో ఎంత మందికి జన్మనివ్వగలదు అనే ప్రశ్నకు సమాధానం జీవ, వైద్య, సామాజిక కోణాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ కలిసి మానవ పునరుత్పత్తి సామర్థ్యాన్ని రూపొందిస్తాయి.

2024 జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తున్నారు. అధిక జనాభా సమస్యలు, సమాజం, పర్యావరణం, అభివృద్ధిపై చూపించే ప్రభావంపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమయంలో ఎక్కువ జననాలకు కారణమయ్యే వైద్య పరిస్థితుల గురించి తెలుసుకోవడం అవసరం. అందుకే boldsky.com రిపోర్ట్ ప్రకారం హైపర్ఓవిలేషన్ అంటే ఏంటి? వాసిలీవా ఎవరు? స్త్రీలు జీవితకాలంలో ఎంతమంది పిల్లల్ని కనగలరు? తెలుసుకుందాం.

*69 మంది పిల్లలను కన్న మహిళ*

ఒక తల్లికి పుట్టిన పిల్లల సంఖ్య అత్యధికంగా 69 అని రికార్డులు సూచిస్తున్నాయి. రష్యాలోని షుయాకు చెందిన రైతు ఫియోడర్ వాసిలీవ్ భార్య వాసిలీవా 27 సార్లు గర్భం దాల్చింది. ఆమెకు 16 కాన్పుల్లో కవలలు, ఏడు సార్లు ముగ్గురు పిల్లలు, నాలుగు కాన్పుల్లో ఒకే సారి 4 పిల్లల చొప్పున పుట్టారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, కొన్ని నివేదికలు ఇది వాస్తమేనని చెబుతున్నాయి. 1782లో నికోల్స్క్ మొనాస్టరీ నుంచి వచ్చిన నివేదికను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రస్తావించింది. ఇందులో ప్రతి జననాన్ని రిపోర్ట్‌ చేశారు. 1782లో సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి వచ్చిన ఒరిజినల్‌ లెటర్‌ ఈ అసాధారణ కథనాన్ని ధృవీకరిస్తోంది. 1878లో ఫ్రెంచ్ అకాడమీ అధ్యయనం వాసిలీవ్ సంతానోత్పత్తికి సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.

*స్త్రీ తన జీవితకాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనివ్వగలదు?*

పిల్లలను ఉత్పత్తి చేసే స్త్రీ సామర్థ్యం ఆమె పుట్టినప్పుడు కలిగి ఉన్న అండాశయ ఫోలికల్స్ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. స్త్రీలు సుమారు ఒకటి నుంచి రెండు మిలియన్ల అండాలతో పుడతారు. అయితే ఈ సంఖ్య కాలక్రమేణా తగ్గుతుంది. యుక్తవయస్సు నాటికి, దాదాపు 300,000 నుంచి 400,000 అండాలు మిగిలి ఉంటాయి. ఆమె పునరుత్పత్తి సంవత్సరాల్లో, ఒక స్త్రీ సుమారు 400 నుంచి 500 సార్లు అండోత్సర్గం చేస్తుంది. మహిళలు సాధారణంగా యుక్తవయస్సు నుంచి మెనోపాజ్ వరకు నెలకు ఒకసారి అండోత్సర్గం చేస్తారు. ఇది 30 నుంచి 40 సంవత్సరాల సంతానోత్పత్తికి దారితీస్తుంది. ఈ విధంగా, థియోరెటికల్‌గా, ఒక స్త్రీ ప్రతి సైకిల్లో గర్భం దాలిస్తే, ఆమె దాదాపు 40 సార్లు గర్భం దాల్చవచ్చు. అయినప్పటికీ, ఆరోగ్యం, మెడికల్‌ కేర్‌, వ్యక్తిగత అంశాలు వాస్తవానికి ఈ సంఖ్యను బాగా తగ్గిస్తాయి.

*ఒక కాన్పులో ఎక్కువ మంది ఎందుకు జన్మిస్తారు?*

ఇక స్త్రీ సాధారణంగా ఒక సైకిల్లో ఒక అండం విడుదల చేస్తుంది. ఒకటి కంటే ఎక్కువ అండాలను విడుదల చేసే స్థితిని హైపర్‌ఓవిలేషన్ అంటారు. ఈ అండాలు ఫలదీకరణం చెందితే, కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది జన్మించవచ్చు. వాసిలియేవ్ ఒక్కో కాన్పులో ఎక్కువ మంది పిల్లలను కనడానికి జన్యు పరంగా వచ్చిన హైపర్‌ఓవిలేషన్‌ కారణంగా కావచ్చు.